రివ్యూ రాజా తీన్‌మార్ : సింగం 3 – యాక్షన్ లవర్స్ మాత్రమే ఈ సింహాన్ని చూడగలరు !

Thursday, February 9th, 2017, 05:55:40 PM IST


తెరపై కనిపించిన వారు : సూర్య, అనుష్క, శృతి హాసన్

కెప్టెన్ ఆఫ్ ‘సింగం – 3’ : హరి

మూలకథ :

ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ నరసింహ (సూర్య)ను కర్ణాటక హోమ్ మంత్రి (శరత్ బాబు) ప్రత్యేకంగా ఒక కేసు విషయమై మంగళూరుకు రప్పిస్తాడు. ఒక కమీషనర్ హత్యకు సంబంధించిన కేసును నరసింహకు అప్పగిస్తారు. నరసింహం ఆ కేసును చాలా తెలివిగా ఇన్వెస్టిగేషన్ చేసి హంతకులను తొందరగానే పట్టుకుంటాడు. అయితే ఆ కేసు వెనుక చాలా స్టోరీ ఉందని, విఠల్ (అనూప్ సింగ్) అనే ఓ పెద్ద బిజినెస్ పర్సన్ ఈ హత్య వెనుక ఉన్నాడని తెలుసుకుంటాడు.

దాంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న నరసింహ ఏం చేశాడు? ఆస్ట్రేలియాలో ఉండే విఠల్‍పై ఎలా ఫైట్ చేశాడు ? కమీషనర్ హత్య వెనుక ఉన్న రహస్యమేంటి ? ఈ కథలో అగ్ని (శృతి హాసన్) ఎవరు? నరసింహ, తన భార్య కావ్య (అనుష్క)కు దూరంగా ఉన్నట్లు ఎందుకు నటిస్తాడు? అన్నదే తెరపై నడిచే సినిమా.

విజిల్ పోడు :

–> సినిమాలో ప్రధాన ప్లస్ పాయింట్ అంటే అది హీరో సూర్య అనే చెప్పాలి. అగ్రెసివ్ పోలీస్ ఆఫిసర్ గా అతని పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన చెప్పిన డైలాగులు, చేసిన యాక్షన్ సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. కనుక మొదటి విజిల్ సూర్యకి, ఆయన చేసిన యాక్షన్ ఎపిసోడ్లకి వెయ్యాలి.

–> ఇక విలన్ ఠాకూర్ అనూప్ సింగ్ పాత్ర బ్యాక్ డ్రాప్ చాలా బాగా ఆకట్టుకుంది. ఎక్కడా హీరో స్థాయికి తగ్గకుండా పోటా పోటీగా ఉండేలా అతని పాత్రను తీర్చిదిద్దారు. దీంతో సినిమా పాత్రల పరంగా చాలా బలంగా తయారైంది. కాబట్టి రెండవ విజిల్ ఈ అంశానికి వెయ్యొచ్చు.

–> ఇక చివరగా హీరోయిన్ శృతి హాసన్ గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్, నటన తెరపై కనువిందు చేశాయి. ఫారిన్ లొకేషన్లో షూట్ చేసిన రెండు పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఈ రెండు అంశాలకు ఆఖరి విజిల్ వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమాలో పెద్ద ఢమ్మాల్ అంటే అది కథే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. మొదటి రెండు భాగాలు సింగం-1, 2 ల్లో ఏదైతే కథ ఉందో అదే ఇక్కడ కూడా రిపీటైంది. ఏమాత్రం కొత్తదనం లేదు. కొన్ని సన్నివేశాల్లో సింగం 2 కళ్ళముందు కదులుతున్న ఫీల్ వచ్చింది.

–> ఇక యాక్షన్ తో పాటే కామెడీని కూడా పండిద్దామనే దర్శకుడి ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. ఆకట్టుకొని కామెడీ కథకు అడ్డుతగులుతున్న భావన కలిగింది.

–> ఇక హెవీగా ఉన్న యాక్షన్ సీన్లు కొంత వరకు తట్టుకునేలా ఉన్నాయి కానీ ఒక హద్దు దాటాక చూడ్డం కష్టమైంది. భీభత్సమైన యాక్షన్ లవర్స్ కూడా కొన్నిటిని తట్టుకోవడం కష్టమే. వాటిని కాస్త తగ్గించి కథ మీద దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..!

–> కొన్ని యాక్షన్ ఎపిసోడ్లలో లాజిక్స్ పూర్తిగా మిస్సవడం కొంత వింతగా తోచింది.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఏ : ఏరా.. సినిమా ఎలా ఉంది ?
మిస్టర్ బి : నువ్వే చెప్పు.
మిస్టర్ ఏ : యాక్షన్ ఉంది కాబట్టి పర్వాలేదనిపించింది.
మిస్టర్ బి: అనుకున్నా ఈ మాటే చెప్తావని.
మిస్టర్ ఏ : మరి నీ సంగతేంటి ?
మిస్టర్ బి : నీకు తెలుసుగా నేనంత హెవీ యాక్షన్ తట్టుకోలేనని.