‘కాసుల వర్షం మాకు.. కనక వర్షం మీకు’ అంటున్న సైజ్ జీరో..!!

Monday, November 23rd, 2015, 01:34:36 PM IST


బాహుబలి.. రుద్రమదేవిల తరువాత అనుష్క పేరు టాలీవుడ్ లో మారుమ్రోగిపోతున్నది. రుద్రమ దేవి వంటి చారిత్రాత్మక చిత్రం తరువాత అనుష్క సైజ్ జీరో సినిమాలో నటిస్తున్నది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇటీవలే సెన్సార్ ను కూడా పూర్తిచేసుకున్నది. అనుకోకుండా లావుగా మారిన అనుష్క.. సన్నాగా ఎలా మారింది అనే పాయింట్ ఆధారంగా సినిమాను నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా… నవంబర్ 27న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున.. వినూత్నంగా ప్రచారం చేసేందుకు పీవీపీ సంస్థ సిద్దమయింది.

సినిమా చూసిన ప్రేక్షకులకు కేజీ బంగారాన్ని ఇవ్వాలని అనుకుంటున్నది. అందరికి కాదండోయ్.. లక్కి డ్రాలో గెలిచిన వాళ్ళకే. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సినిమా చూసే ప్రేక్షకులకు టిక్కెట్ తో పాటు.. పీవీపీ నిర్మాణ సంస్థ వోచర్ ను ఇస్తారు. ఆ వోచర్ పై ఉన్న నెంబర్ ను 95495466666 నెంబర్ కు మెసేజ్ చేయడంకాని, లేదా.. పీవీపీ సినిమా వెబ్ సైట్ కి వెళ్లి అందులో లాగిన్ అవ్వడం కాని చేయాలి. సినిమా విడుదలైన మూడు వారాల అనంతరం.. 20 మందిని ఎంపిక చేసి.. వారికి అనుష్కను కలిసే అవకాశం కల్పిస్తారు. ఆ తరువాత ఆ 20 మందిలో లక్కిడ్రా ద్వారా ఒకరిని ఎంపిక చేసి.. ఆ ఒక్కరికి కేజీ బంగారాన్ని అందజేస్తారు. ఫ్రీగా బంగారం వస్తుంటే.. ఎవరు కాదంటారు చెప్పండి. ముఖ్యంగా ఆడవాళ్ళు. మరి 27 వ తేదీన మహిళామణులు ధియేటర్ల ముందు క్యూ కట్టేస్తారేమో చూద్దాం.

పీవీపీ సంస్థ ఈ గోల్డ్ ఆఫర్ కాంటెస్ట్ ను నిర్వహించడానికి కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో, ఎంత పెద్ద సినిమా తీసిన.. పైరసీ భూతం నుంచి కాపాడుకోలేకపోతున్నారు. ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. ఏదో ఒక రూపంలో పైరసీ తన పంజాను విసురుతున్నది. పైరసీ నుంచి సైజ్ జీరో ను కాపాడేందుకే.. ఈ విధమైన కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది.