బ్రేకింగ్: తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. ఇంటర్ పరీక్షలు వాయిదా..!

Thursday, April 15th, 2021, 07:10:14 PM IST

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు విద్యాశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే స‌మ‌యంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని భావించినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల కారణంగా విద్యాశాఖ ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ సైతం అంగీకారం తెలిపారని, పరీక్షల రద్దుకు సంబంధించిన ఫైల్‌పై ఆయన సంతకం కూడా పెట్టినట్టు సమాచారం.

అంతేకాదు ఈ రోజే పరీక్షల రద్దుకు సంబంధించిన విషయంపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో 5 లక్షల 35 వేల మంది టెన్త్‌ విద్యార్థులు ఉండగా వీరందరినీ పైతరగతులకు ప్రమోట్‌ చేయబోతున్నారు. అయితే కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాక ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది.