విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేతను ఫైనల్ చేసిన టీడీపీ..!

Friday, March 5th, 2021, 01:04:34 AM IST


ఏపీలో మున్సిపల్ ఎన్నికల పర్వం మొదలైన నేపధ్యంలో అందరి కళ్లు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మీదనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించేసింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్థిగా ఫైనల్ చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ సర్క్యులర్ జారీ చేశారు. అయితే 11వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా కేశినేని శ్వేత పోటీ చేస్తున్నారు.

అయితే కొద్ది రోజుల క్రితం టీడీపీలో ఓ వర్గం కేశినేని శ్వేత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో టీడీపీ మేయర్ అభ్యర్థిపై కొంత అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే అవేమి పట్టించుకోకుండా ఆమె తన వంతు ప్రచారం చేసుకుంటుంటూ పోతుంది. ఈ క్రమంలో తాజాగా టీడీపీ అధిష్టానం కేశినేని శ్వేత పేరునే మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆ సస్పెన్స్‌కి తెరపడిపోయింది. ఇదిలా ఉంటే 24 ఏళ్ల కేశినేని శ్వేత అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయంలో బీఏ (సైకాలజీ, ఎకనామిక్స్‌) చేశారు. ఘనాలో మైక్రో ఫైనాన్స్‌ కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్ట్‌, ఐర్లాండ్‌లో చైల్డ్‌ సైకాలజీ ప్రోగ్రామ్‌లో పనిచేశారు. అంతేకాదు టాటా ట్రస్ట్‌కు సంబంధించిన ప్రాజెక్టుల్లోనూ వివిధ బాధ్యతలు చేపట్టారు. కేశినేని శ్వేతకు ఇవి తొలి ఎన్నికలైనా గత సార్వత్రిక ఎన్నికల్లో తండ్రి కేశినేని నాని తరపున ప్రచారం చేసి ఆయన గెలుపులో కీలక పాత్ర పోశించడం ఆమెకు కలిసొచ్చే అంశమని చెప్పుకోవచ్చు.