చంద్రబాబుకు మరింత భద్రత కల్పించాలి.. టీడీపీ ఎంపీలు డిమాండ్..!

Wednesday, April 14th, 2021, 01:57:22 AM IST


తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సభపై నిన్న గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంపై టీడీపీ నేతలు సీరియస్‌గా ఉన్నారు. ఈ ఘటనపై టీడీపీ ఎంపీలు నేడు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ రామ్మోహన్ నాయుడు వైసీపీ ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై అజయ్ భల్లాకు ఫిర్యాదు చేసామని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందని అన్నారు.

అయితే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత అన్ని అనుమతులు తీసుకొని నిర్వహించిన సభపై రాళ్ల దాడి జరగడం నిజంగా దుర్మార్గపు చర్య అని అన్నారు. రాష్ట్ర పోలీసుల లోపం ఉందని స్పష్టంగా తెలుస్తుందని, ఈ ఘటనకు పాల్పడిన వారిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరామని, ఎన్నికలకు కేంద్ర బలగాలను పంపేందుకు కూడా అజయ్ భల్లా హామీ ఇచ్చినట్టు తెలిపారు. చంద్రబాబుకు జెడ్ ప్లస్ ఉన్నా ఇంకా అదనపు బలగాలతో భద్రత కల్పించాలని కోరినట్టు కూడా తెలిపారు.