తెలంగాణలో లాక్‌డౌన్.. రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం..!

Monday, May 10th, 2021, 10:01:52 PM IST

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనాను కట్టడి చేసే క్రమంలో రాష్ట్రలో లాక్‌డౌన్ విధించే అంశంపై రేపు తెలంగాణ కేబినెట్ అత్యవసర సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ఈ భేటీలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే అంశంపై ప్రధానంగా చర్చ జరగనుందని తెలుస్తుంది. అయితే లాక్‌డౌన్ విధిస్తే వచ్చే సమస్యలపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు జరగాల్సిన సమయం కావడంతో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే కరోనా నుంచి కోలుకున్నాక మొదటిసారి రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇటీవల సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ తెలంగాణలో లాక్‌డౌన్ ఉండబోదని, ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా కేసులు తగ్గడం లేదని, లాక్‌డౌన్ వల్ల ఆర్థికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కరోనా ఉదృతి దృష్ట్యా దేశంలో చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్ విధించుకున్నాయి. దీంతో తెలంగాణలో కూడా లాక్‌డౌన్ విధించాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో రేపు జరగబోయే కేబినెట్ భేటీలో దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.