తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు.. క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్..!

Thursday, May 6th, 2021, 11:40:29 PM IST

తెలంగాణలో లాక్‌డౌన్ ఉండబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకుని నేడు ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ అనంతరం రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా కేసులు తగ్గడం లేదని, లాక్‌డౌన్ వల్ల ఆర్థికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని అన్నారు. లాక్‌డౌన్ పరిష్కారం కాదని, ప్రజల జీవనం కుప్పకూలిపోయే అవకాశం ఉందని అన్నారు. అయితే కేసులు జూన్ వరకు తగ్గుముఖం పడతాయని, అప్పటి వరకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు.

అయితే రాష్ట్రానికి కావాల్సిన వాక్సిన్లు ఆక్సీజన్, రెమిడిసివర్ సరఫరా గురించి ప్రధాని మోదీతో టెలిఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్ వాటిని ఎక్కువ మొత్తంలో అందించాల్సిందిగా కోరారు. మహారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కరోనా చికిత్స కోసం చాలా మంది హైదరాబాద్‌కు వస్తున్నారని దీంతో ఆక్సీజన్, వ్యాక్సిన్, రెమిడిసివర్ మంటి మందులపై భారం పడుతుందని ప్రధానికి తెలిపారు. ప్రస్తుతం రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే రాష్ట్రానికి అందుతోందని దానిని 500 మెట్రిక్ టన్నులకు పెంచాలని, రోజుకు తెలంగాణలో కేవలం 4,900 రెమిడిసివర్లు మాత్రమే అందుతున్నాయని వాటిని రోజుకు కనీసం 25,000 కు పెంచాలని కూడా ప్రధానిని సీఎం కేసీఆర్ కోరినట్టు తెలుస్తుంది.