చిత్రపరిశ్రమలో విబేధాలు లేవు!

Tuesday, November 25th, 2014, 11:19:55 AM IST


ఉత్తరాంధ్రను కుదిపేసిన హుధుద్ తుఫాను బాదితుల సహాయార్ధం తెలుగు చిత్ర సీమ నవంబర్ 30వ తేదీన ‘మేము సైతం’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా దీనిపై సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా చిత్ర పరిశ్రమ తనవంతు సాయం చేసిందని, ఇప్పుడు హుధుద్ బాధితులను ఆదుకోవడం కోసం మరో సారి పరిశ్రమ మొత్తం ముందుకు వస్తోందని వివరించారు.

అలాగే హుధుద్ ప్రెస్ మీట్ సమావేశాలకు ఒక్కోసారి ఒక్కోక్కరు రాలేకపోవడాన్ని కొందరు తప్పుగా చిత్రీకరిస్తున్నారని, పరిశ్రమలో విభేదాల వల్లే అలా జరుగుతోందని ప్రచారం చేస్తున్నారని, నిజానికి చిత్రసీమలో ఎలాంటి విభేదాలు లేవని, ఎవరి వీలును బట్టి వారు హాజరవుతున్నారని దాసరి వివరించారు. ఇక మరో ప్రముఖ నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ తాము ఈ స్థాయికి చేరడానికి కారణమైన ప్రజలకు సాయం చెయ్యడానికి మేమున్నామంటూ అందరం ముందుకు వస్తున్నామని తెలిపారు.