మైనర్ బాలికపై అత్యాచారం.. టిక్ టాక్ స్టార్ భార్గవ్ అరెస్ట్..!

Tuesday, April 20th, 2021, 10:10:59 PM IST

టిక్ టాక్ స్టార్, ఫన్ బకెట్ భార్గవ్ ఓ మైనర్ బాలికపై అత్యచారానికి పాల్పడ్డాడు. టిక్ టాక్ వీడియోలతో బాగా పాపులర్ అయిన భార్గవ్‌కు విశాఖ జిల్లా వేపగుంటకు చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. టిక్ టాక్ వీడియోలపై ఆ బాలికకు కూడా ఆసక్తి ఉండడంతో ఇద్దరు తరచూ మాట్లాడుకునేవారు. అయితే ఆ బాలిక భార్గవ్‌ను అన్నయ్య అని పిలిచేది. కానీ భార్గవ్ మాత్రం ఆ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. పలుసార్లు అత్యచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో హైదరాబాద్‌లో భార్గవ్‌ను విశాఖ పోలీసులు అరెస్ట్‌ చేశారు. భార్గవ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. తాను చేసిన తప్పును భార్గవ్ కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ మీడియాతో మాట్లాడుతూ టిక్ టాక్ పై మోజున్న అమ్మాయిలను టిక్ టాక్‌లో పాపులర్ చేస్తానని, సినిమా ఛాన్సులు ఇప్పిస్తానని చాలా మంది అమ్మాయిలను నమ్మించి మభ్యపెట్టి భార్గవ్ మోసం చేసినట్టు విచారణలో తేలిందని, ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు.