భారత్‌లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్ళీ లాక్‌డౌన్ తప్పేలా లేదుగా?

Saturday, April 10th, 2021, 03:13:37 PM IST


భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఓ పక్క వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నప్పటికీ రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇటీవల కరోనా పరిస్థితులపై మాట్లాడిన ప్రధాని మోదీ దేశంలో లాక్‌డౌన్ ఉండదని చెప్పినా పెరుగుతున్న కేసులను బట్టి చూస్తుంటే లాక్‌డౌన్ మళ్ళీ తప్పేలా లేనట్టుగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించుకున్నాయి.

అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 1,45,384 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి కొత్తగా 794 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,32,05,926కి చేరింది. అయితే ప్రస్తుతం అందులో 10,46,631 యాక్టివ్ కేసులు ఉండగా, 1,19,90,859 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 1,68,436 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 77,567 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 90.8 శాతం ఉండగా, మరణాల రేటు 1.3 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.