ఏపీలో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ.. టైమింగ్స్ ఏంటంటే?

Friday, April 23rd, 2021, 07:32:36 PM IST

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమలు చేయబోతుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఏపీలో 18 ఏళ్ల పైబడిన వారందరికి మే 1 నుంచి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించేలా చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే 45 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తుండగా తాజాగా 18 ఏళ్లు పైబడిన వారికి ఎంత మొత్తంలో వ్యాక్సిన్ అవసరం అవుతుందో చెప్పాలని సీఎం జగన్ సూచించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని 18 సంవత్సరాలు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం రూ.1600 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు మంత్రి ఆళ్ల నాని తెలిపారు.