తోటి ఉద్యోగితో బూట్ల మట్టి తుడిపించుకున్న ట్రైనీ కలెక్టర్..!

Monday, July 6th, 2020, 11:13:24 AM IST

ఆయనొక చదువుకున్న విద్యావేత్త.. పేరుకు అత్యున్నత కలెక్టర్ ఉద్యోగం. అయినా కనీస మర్యాద, సంస్కారం లేకుండా వ్యవహరించి తన కింది స్థాయి ఉద్యోగితో బూట్లకు అంటిన మట్టిని తుడిపించుకున్నాడు. కరీంనగర్ జిల్లా శంఖరపట్నం మండలంలోని కాల్వల గ్రామంలో ట్రైనీ కలెక్టర్ అంకిత్ పర్యటించాడు. అయితే ఆయన వెనక ఉన్న ఉద్యోగి జాగ్రత్త సార్ వర్షం పడిందని చెప్పినా వినకుండా పొలం గట్లపై బూట్లతోనే నడవసాగాడు ఆ ట్రైనీ కలెక్టర్.

అయితే కొద్ది దూరం నడవగానే బూట్లకు మట్టి అంటుకుపోయి, బూట్ల బరువు పెరిగిపోయి అడుగు తీసి అడుగు వెయ్యలేక నిలబడిపోయాడు. వెంటనే వెనక్కి తిరిగి తన కింది స్థాయి ఉద్యోగి అయిన అటెండర్‌వైపు సీరియస్‌గా చూస్తూ ఏందయ్యా ఈ మట్టి ఏదైనా చెయ్యీ అని అనడంతో ఆ ఉద్యోగికి ఏం చెయ్యాలో అర్థం కాక వెంటనే వంగి ఆ ట్రైనీ కలెక్టర్ బూటూ కాలి మట్టి తీశాడు. ఇదంతా చూసిన స్థానికులు కలెక్టర్ వ్యవహారంపై మండిపడ్డారు. సాటి ఉద్యోగిని గౌరవించడం తెలీదు, ఇంత చదువు చదివాడు ఏం లాభం కనీస సంస్కారం కూడా లేదని తిట్టుకున్నారు.