ఫోన్ చేసి బెదిరించింది.. జీహెచ్ఎంసీ మేయర్‌పై టీఆర్ఎస్ నేత ఆరోపణలు..!

Saturday, March 6th, 2021, 01:12:28 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై టీఆర్ఎస్ నేత సంచలన ఆరోపణలు చేశారు. ఆమె నుంచి ప్రాణహాని ఉందని సిటీ టీఆర్ఎస్ నేత చెట్లపల్లి రామ్ చందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బంజారాహిల్స్‌లో ఓ కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణంలో ఉండగా, రాఘవేంద్ర కనస్ట్రక్షన్ అనే సంస్థ నాలాను కబ్జా చేస్తుండగా, స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని తాను మూడు నెలల కిందట ఆర్టీఐ కింద అధికారులకు అర్జీని పెట్టుకున్నానని అన్నారు.

అయితే దీనిపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కలుగచేసుకుని నిన్న తనకు కాల్ చేసి బెదిరించిందని, నిన్ను జైల్లో పెడతా.. పోలీసులను పంపించి అరెస్ట్ చేయిస్తానని మాట్లాడిందని అన్నారు. అయితే మేయర్ నుంచి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఈ విషయాన్ని తాను అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తానని ఆయన చెప్పుకొచ్చారు.