మరోసారి నోరు జారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. ఈ సారి కేసీఆర్ టార్గెట్..!

Saturday, April 3rd, 2021, 08:30:28 AM IST

టీఆర్ఎస్ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరోసారి నోరు జారారు. గతంలో అయోధ్య రామాలయ నిర్మాణం విరాళాల సేకరణ మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ఆ వివాదం కాస్త చల్లారిందనుకుంటున్న సమయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరోసారి నోరుజారారు. గత కొన్ని నెలలుగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున నిరసనలు తెలియజేస్తుంటే పట్టించుకోని పుణ్యాత్ముడు ప్రధాని మోదీ, కేసీఆర్ అని వ్యాఖ్యానించారు.

అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పొరపాటున సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత చేసిన వ్యాఖ్యల్లో కేవలం ప్రధాని నరేంద్ర మోదీనీ మాత్రమే టార్గెట్ చేస్తూ చల్లా విమర్శలు గుప్పించారు. ఈ రోజు రైతాంగం ఇబ్బందులు పడుతుంటే, వారిని పిలిచి మాట్లాడకపోవడం మంచి పద్దతి కాదని అన్నారు. అయితే ప్రజాప్రతినిధులు మీడియా ముందు మాట్లాడేటప్పుడు కాస్త ఆచి తూచీ మాట్లాడితే ఏ ఇబ్బందులు ఉండవు, ఏ మాత్రం నోరు జారినా నవ్వుల పాలు కాక తప్పదు.