కబ్జా చేసిన‌ట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే స‌వాల్..!

Wednesday, May 5th, 2021, 01:30:07 AM IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒకింత సంచలనం రేపింది. భూ కబ్జా ఆరోపణలు, నిర్ధారణలు, మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయడం అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే ఈటల వ్యవహారం బయటకు వచ్చాక టీఅర్ఎస్‌లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కబ్జాలకు పాల్పడ్డారని వారిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదన్న ప్రశ్నలు ఎక్కువగా వినిపించాయి. ఈ క్రమంలోనే జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి.

అయితే దీనిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈట‌ల వ్య‌వ‌హారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్లు సరికాదని అన్నారు. అయితే అరవై ఎకరాలలో తాను గుంట భూమి కబ్జా చేసిన‌ట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాన‌ని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. . జనగామ చౌరస్తాలో అంబేద్కర్ పాదాల వద్ద ముక్కు నేలకు రాసి రాజీనామా పత్రాన్ని అంబేద్కర్ పాదాల వద్ద ఉంచి సీఎం కేసీఆర్‌కు అంద‌జేస్తాన‌ని అన్నారు.