తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు కరోనా పాజిటివ్..!

Tuesday, April 6th, 2021, 06:04:45 PM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. ఓ పక్క వాక్సిన్ పంపిణీ జరుగుతున్నప్పటికి కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అయితే సామాన్యులతో పాటు ఎంతో మంది ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అయితే స్వల్ఫ లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని సీఎస్‌ స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఆయన వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ కూడా తీసుకున్నారు. అయితే గత వారం రోజులుగా తనను కలిసిన వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే నిన్న సీఎం కేసీఆర్‌తో సోమేష్‌కుమార్‌ సమావేశం కావడంతో సీఎం కేసీఆర్ కూడా కరోనా టెస్ట్ చేయించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.