అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అఖండ విజయం సాధించి.. ట్రంప్ కు భారీ షాక్ ఇచ్చాడు. బైడెన్‌కు ఇప్పటివరకు 284 ఎలక్టోరల్ ఓట్లు వచ్చినట్టు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. సీఎన్ఎన్ కూడా బైడెన్ మ్యాజిక్ మార్కు దాటేసినట్టు వెల్లడించింది. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకు గాను బైడెన్ 284 ఓట్లు సాధించగా.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమయ్యారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓట్లు సాధించి బైడెన్ గెలవడానికి అసలు కారణం ఆయన రాజకీయ ప్రస్థానమే అని అక్కడి పత్రికలు చెబుతున్నాయి.
బైడెన్ సుదీర్ఘ రాజకీయ అనుభవమే అమెరికా జై బైడెన్ అనేలా చేసిందట. దీనికి తోడు ట్రంప్ పాలన వైఫల్యాలు కూడా బైడెన్ విజయ సోపానాలయ్యాయి అనుకోవచ్చు. ఆరోగ్య రంగాన్ని ట్రంప్ నిర్లక్ష్యం చేయడం.. అదే సమయంలో కరోనా కాటుకు అమెరికన్లు భారీగా చనిపోవడం అక్కడి ప్రజల పై తీవ్ర ప్రభవాన్ని చూపించింది. ఏది ఏమైనా అమెరికాలో ఒకసారి అధ్యక్ష పీఠం ఎక్కినవారు రెండోసారి అధిష్ఠించడం పరిపాటిగా మారిన తరుణంలో ట్రంప్‌కు అవకాశం లేకుండా చేసిన బైడెన్.. తన రాజకీయ పరిపక్వతతో ప్రజల మనస్సులు గెలుచుకున్నారు. తన 50 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎట్టకేలకు అధ్యక్ష పీఠం కైవసం చేసుకున్నారు. సర్వేలన్నీ బైడెన్‌కే అనుకూలంగా వచ్చినప్పటికీ పోటీ రసవత్తరంగా సాగిందనే చెప్పాలి.