వకీల్ సాబ్ సెన్సార్ రివ్యూ.. బొమ్మ దద్దరిల్లడం ఖాయం..!

Monday, April 5th, 2021, 07:32:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా “వకీల్ సాబ్”. మూడేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. అయితే ఏప్రిల్‌ 9న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

అయితే తాజాగా ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకోవడంతో U/A సర్టిఫికేట్ వచ్చింది. సెన్సార్ రివ్యూ ప్రకారం చూసుకున్నట్టయితే దర్శకుడు వేణు శ్రీరామ్ పింక్ సినిమాలోని కథను చెడగొట్టకుండా పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా వకీల్ సాబ్‌ను పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. రెండున్నర గంటల నిడివితో ఉన్న ఈ సినిమాలో పవన్ ఎక్కువ సేపు కనిపించకపోయినా ఉన్నంత సేపు మాత్రం బొమ్మ దద్దరిల్లేలా ఉండబోతున్నట్టు అర్ధమవుతుంది. అయితే పింక్ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేకున్నా వకీల్ సాబ్‌లో మొత్తం 5 యాక్షన్ సీక్వెన్సులు ఉండబోతున్నాయని అందులో రెండు మూడు యాక్షన్ సీక్వెన్సులు భారీగానే ఉండబోతున్నాయని, పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కూడా ఫైట్‌తోనే ఉంటుందని సెన్సార్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.

ఇకపోతే ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయని, ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కోర్టు సన్నివేశాలు, కోర్టులో ప్రకాశ్ రాజ్, పవన్ కళ్యాణ్ కోర్టులో వాదించే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో ఇచ్చాడని సెన్సార్ టాక్ ద్వారా తెలుస్తుంది. మరి ఇంత ఉవ్విలూరిస్తున్న ఈ సినిమా అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరీ.