పోలీసులు చనిపోతే ఎందుకు మాట్లాడలేదు?

Saturday, April 11th, 2015, 04:06:15 PM IST


కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు శనివారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల జరిగిన వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై సీబీఐ దర్యాప్తు చెయ్యాల్సిందిగా డిమాండ్ చేస్తున్న ఎంఐఎం నేతలపై మండిపడ్డారు. ఇక వెంకయ్య మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులను సమర్ధిస్తూ మాట్లాడడం సరికాదని అభిప్రాయపడ్డారు. అలాగే సూర్యాపేటలోను, అంతకు ముందు జరిగిన కాల్పులలో పోలీసులు మరణిస్తే ఎంఐఎం ఎందుకు మాట్లాడలేదని వెంకయ్య ప్రశ్నించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలోని ఎన్ కౌంటర్లపై కేంద్ర జోక్యం చేసుకోదని, శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోనిదని స్పష్టం చేశారు. అలాగే సామాన్యులు చనిపోతే స్పందించని హక్కుల నేతలు ఉగ్రవాదులు చనిపోతే స్పందించడం విచారకరమని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తీవ్రవాది లఖ్వీ విడుదల విచారకరమని, దీనిని కేంద్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని వెంకయ్య స్పష్టం చేశారు.