బిగ్ న్యూస్: కేసీఆర్ గారికి అలవాటుగా మారింది…విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Friday, November 27th, 2020, 10:53:57 AM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై నటి, మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక బెంబేలెత్తి పోతున్న తెరాస అధినేత కేసీఆర్ గారు ఎం ఐ ఎం తో కలిసి కుట్రలు చేసి ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధులను చివరి క్షణంలో పోటీ నుండి తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి అని పేర్కొన్నారు. ఎం ఐ ఎం నేతలు మతవిద్వేశాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే దానిని కట్టడి చేయకపోగా, ఎం ఐ ఎం దౌర్జన్యాన్ని నిలదీసిన పార్టీలను నియంత్రించే విధంగా పోలీసు బలగాలను ప్రయోగించడానికి సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్ వేశార నే వార్తలు వస్తున్నాయి అని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇంతకాలం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను హైజాక్ చేయడం లేదా ఎన్నికలు పూర్తి అయిన తర్వాత గెలిచిన ప్రతి పక్ష పార్టీ అభ్యర్ధులను ప్రలోభ పెట్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం కేసీఆర్ గారికి అలవాటుగా మారింది అని ఆరోపించారు. అయితే జీ హెచ్ ఎం సి ఎన్నికల్లో ఇలాంటి రాజకీయాలు ఫలించవని నిర్ణయానికి రావడం తో ఏకంగా బలమైన ప్రత్యర్ధి పార్టీ అభ్యర్థులను శాంతి భద్రతల పేరుతో బరిలో నుండి తప్పించడానికి గులాబీ బాస్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది అని విజయశాంతి చెప్పుకొచ్చారు. అయితే ఈ కుట్రలకు పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తే తెలంగాణ సమాజం సహించదు, క్షమించదు అంటూ తెరాస ప్రభుత్వం ను హెచ్చరించారు.