పాలన చేతగాక నిలదీసినవారికి తిట్లు, శాపనార్థాలు పెడుతున్నారు – విజయశాంతి

Saturday, April 17th, 2021, 02:00:05 AM IST

తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సాగర్ ఉపఎన్నిక సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు చేసిన ప్రచారం తీరు చూస్తే వారిలో అహంకారం, పొగరు ఏ స్థాయిలో పెరిగిపోయాయన్నది ప్రజలకు మునుపెన్నడూ లేనంత స్పష్టంగా అర్థమైందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మొదలుపెట్టి మంత్రులు, ఇతర నేతలు అందరూ ప్రజల్ని అవమానించడంలో పోటీ పడుతున్నారని, ఫిబ్రవరిలో జరిగిన హాలియా సభలో విజ్ఞప్తి పత్రాలతో వచ్చిన మహిళలు, ఎస్టీలను కుక్కలు అంటూ కేసీఆర్ అవమానించారని అన్నారు.

అంతేకాదు ఇటీవల అనుముల మండలం కొత్తపల్లిలో ప్రచారానికి వచ్చిన మంత్రి జగదీశ్ రెడ్డిని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక నిరుద్యోగి ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగభృతి హామీ గురించి అడిగినందుకు అతన్ని తొక్కిపడేస్తానంటూ కుక్కలతో పోల్చి అవమానించారని, వీరి దురుసుతనం మీడియా సాక్షిగా జనం దృష్టికి వచ్చింది. తెలంగాణలో అధికార పార్టీ నేతల నిర్లక్ష్యపూరిత వైఖరిని ప్రతి సందర్భంలోనూ ప్రజలు రుచి చూస్తూనే ఉన్నారు. పాలన చేతగాక నిలదీసినవారికి తిట్లు, శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు. ఇక వీరి యువనేత, మరో మంత్రి కేటీఆర్ కూడా ఏమీ తక్కువ కాదు. తెలంగాణ సర్కారు తప్పుల్ని ఎత్తి చూపినందుకు ఆయన ఏకంగా బీజేపీ నేతలకు చివరి వార్నింగ్ ఇచ్చారు. అది చాలక ప్రధాని మోదీ గారు, హోంమంత్రి అమిషా గారిపైనా తన అక్కసు వెళ్ళగక్కారని విజయశాంతి ఆరోపించారు. ప్రజల మధ్యకు వచ్చినప్పుడైనా వినయంగా ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేని ఈ తెలంగాణ పాలకులకు త్వరలోనే జనం గట్టి గుణపాఠం నేర్పడం ఖాయమని విజయశాంతి అన్నారు.