పాప పరిహారం కోసమె నదీమతల్లికి మొక్కులు.. కేసీఆర్‌పై రాములమ్మ సెటైర్లు..!

Thursday, January 21st, 2021, 02:02:44 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి ట్విట్టర్ వేదికగా సెటైర్లు గుప్పించారు. ఒకవైపు కేటీఆర్‌ను తెలంగాణ కాబోయే సీఎంగా పేర్కొంటూ పట్టాభిషేకం జరిగే అవకాశాలపై మంత్రులే సంకేతాలిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ గారు ప్రాజెక్టుల చుట్టూ ప్రదక్షిణ చేసి.. గోదావరికి హారతులిచ్చి.. పూజాదికాలు నిర్వర్తించడం పలు అనుమానాలను రేకెత్తించిందని అన్నారు.

అయితే మంగళవారం నాటి పర్యటనలో కాళేశ్వరం తదితర ప్రాజెక్ట్‌లను కేసీఆర్ గారు ఆకాశానికెత్తేశారని, ఇన్నాళ్లూ కమిషన్ల రూపంలోనో.. మరో రూపంలోనో తనను కనికరించిన ఆ ప్రాజెక్టుల వద్ద ఆయన పర్యటనలు, ఆలయాల్లో పూజలు చూస్తే కొడుక్కి పీఠం అప్పగించి తాను నిష్క్రమించే ముందు ఇస్తున్న థ్యాంక్స్ గివింగ్ పార్టీలా.. లేదా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్లు దోచుకున్నందుకు పాప పరిహారంగా నదీమతల్లికి మొక్కులు చెల్లించుకున్నట్టు ఆయన తీరు కనిపిస్తోందని విజయశాంతి వ్యాఖ్యానించారు. రైతాంగం, ప్రజల సంక్షేమం పట్ల సారుకు ఎంత చిత్తశుద్ది అంటే.. ఈ ప్రాజెక్టులకు భూములిచ్చిన నిర్వాసితులు ఉపాధి కోసం విజ్ఞప్తి చేసుకోవడానికి వస్తే కలుసుకునే సమయమే లేకుండె పాపమని ఎద్దేవా చేశారు.