‘కారు’ జోరుకు కారణమేంటీ..?

Saturday, May 17th, 2014, 11:24:50 AM IST


గులాబీ బాస్ మళ్లీ సత్తా చాటారు. టీఆర్ఎస్ తోనే బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మారు. మెజారిటీ అసెంబ్లీ సీట్లిచ్చి అధికారం కూడా కట్టబెట్టారు. కేసీఆర్ కు అంత సీన్ లేదు.. తెలంగాణ ఇచ్చిన మాదే గెలుపన్న హస్తం పార్టీ టీఆర్ఎస్ కారు వేగం ముందు చిత్తయింది.
ఇంకా చెప్పాలంటే కన్ను తప్పి లొట్టపోయింది. ఇంతకీ తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపుకు కారణం ఏంటి? హస్తం పార్టీని ఓటర్లు ఎందుకు తిరస్కరించారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

తెలంగాణ కోసం దరువేసి ఉద్యమించిన టీఆర్ఎస్ కల సాకారమైంది. పోరాటంలో గెలిచి ఎన్నికల్లో నిలబడ్డ ఆ పార్టీకే తెలంగాణ ఓటర్లు పట్టం కట్టారు. తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది మేమే అన్న హస్తం పార్టీ ఆశలకు గండి కొట్టారు. ఆ పార్టీకి చెందిన హేమా హేమీలకు సైతం ముఖం వాచిపోయేలా కొర్రి పెట్టారు. అధికారం మాదేనని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. మోడీ హవా లేకపోయినా టీడీపీ-బీజేపీ కూటమి కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది.

ఈ విజయంతో మాటల మాంత్రికుడు కేసీఆర్.. తెలంగాణలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. ముందు చెప్పినట్టు టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయక పోవడం కూడా టీఆర్ఎస్ కు కలిసొచ్చింది. తద్వారా.. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో పెరిగి పోయిన అసంతృప్తి.. టీఆర్ఎస్ పై పడకుండా కాపాడుకున్నారు. పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ పంపిన రాయబారాల్ని కూడా గులాబీ బాస్ పట్టించుకోలేదు. కాంగ్రెస్ లేదా బీజేపీతో పొత్తు లేకపోతే నష్టపోతామేమో అన్న హెచ్చరికల్ని కూడా లెక్క చేయలేదు. నా సర్వేలు నాకున్నాయి.. ప్రజలు టీఆర్ఎస్ కే పట్టం కడతారు.. చూడండని కేసీఆర్ మాటలే ఇపుడు నిజమయ్యాయి.

నిజానికి కాంగ్రెస్, టీడీపీలతో పోలిస్తే తెలంగాణ టీఆర్ఎస్ కేడర్ అంతంత మాత్రమే. కొన్ని జిల్లాల్లో అయితే అసలు కేడరే లేదు. ఖమ్మం జిల్లానే ఇందుకు ఉదాహరణ. దీంతో ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా.. దాన్ని ఓట్లుగా మార్చకోలేని పరిస్థితి. ఈ సమస్యను అధిగమించేందుకు కేసీఆర్ అనుసరించిన వ్యూహం బాగానే వర్కవుట్ అయింది. ఆయా జిల్లాల్లో వివిధ పార్టీలకు చెందిన బలమైన నాయకుల్ని టీఆర్ఎస్ లోకి రప్పించి వారికి టెక్కెట్లిచ్చారు. ఈ వ్యూహంలో భాగంగా తెలంగాణకు చెందిన అనేక మంది టీడీపీ నేతలు టీఆర్ఎస్ లో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో చాలా మంది గెలుపొందారు. దీని వలన మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న కొంత మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా.. వారిని ఏదో విధంగా ఒప్పించారు.

అయితే తెలంగాణలో టీడీపీ ఉనికి లేకుండా చేసేందుకు గులాబీ బాస్ చేసిన ప్రయత్నాలు మాత్రం పెద్దగా ఫలించలేదు. లోక్ సభ తో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం టీడీపి – బీజేపీ కూటమి గులాబీ దళానికి గట్టి పోటీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లే గెలుచుకుని అసెంబ్లీలో సైతం ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించబోతోంది. తెలంగాణలోని వెనకబడిన కులాల్లో టీడీపీకి ఉన్న పట్టే ఇందుకు కారణం. అయితే బీజేపి – టీడీపీ పొత్తు వలన తెలంగాణలోని ముస్లిం మైనారిటీల ఓట్లు కొన్నయినా టీఆర్ఎస్ కు మళ్లాయని అంచనా. ఎంఐఎం నేతలకు కుదిరిన రహస్య అవగాహన కూడా టీఆర్ఎస్ కు కలిసొచ్చింది.

సరైన క్యాడర్, ఆర్థిక బలం లేక పోయినా తెలంగాణలో టీఆర్ఎస్ గెలవడానికి ప్రధాన కారణం సెంటిమెంట్. దేశవ్యాప్తంగా వీస్తున్న కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు, కేసీఆర్ మాటల తూటాలు కూడా ఇందుకు దోహదం చేశాయి. ఓట్ల యుద్దంలో గెలిచిన టీఆర్ఎస్ ఇపుడు తెలంగాణ పునర్నిర్మాణం ఎలా చేపడుతుందో వేచి చూడాల్సిందే. మొత్తం మీద కాంగ్రెస్ నేతల అతి విశ్వాసం, ఉద్యమ పార్టీగా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ను ఆదరించడం, తెలంగాణలో మోడీ గాలి లేక పోవడం… టీఆర్ఎస్ కు కలిసొచ్చాయి.