కొత్త రాజధాని ఎక్కడ..?

Friday, October 10th, 2014, 05:03:11 PM IST

chandhrababu-ap-govt
మొన్న ఒక్కచోట. నిన్న ఇంకో చోట.. ఇప్పుడు వేరే చోట.. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడనే విషయం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ప్రభుత్వ పెద్దల మనసు దాటి బయటకు రాలేకపోతున్న సమస్యగా మారింది. ఏపీ నూతన రాజధాని ఎక్కడా అనే దానిపై రోజుకో ప్రకటన రావడంతో అంతా గందరగోళంగా మారింది. రాజధాని నిర్మాణం కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్యే ఉంటుందని తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవల రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాలే అన్న ఏపీ సర్కార్.. ఇప్పుడు కాస్త మాట మార్చింది.

రాజధానిపై ఏపీ మంత్రులు ఓ ప్రకటన చేస్తే ముఖ్యమంత్రి ప్రకటన మరోలా ఉంటోంది. ఇప్పటికే గుంటూరు, విజయవాడ, మంగళగిరి.. వంటి ప్రాంతాల పేర్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే సీన్ రిపీటవుతోంది. అధికారంలో ఉన్న ముఖ్యులే రోజుకో ప్రదేశం పేరు చెప్పడంతో ఆయా ప్రాంతాలలో భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి. రాజకీయ నేతలు, వ్యాపారులు అవకాశం ఉన్నమేరకు ఆయా ప్రాంతాలలో భూములు కొనిపెట్టుకున్నారు. బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దండిగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీగా లాభపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు వచ్చే విధంగా మంత్రులు ప్రకటనలు చేస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. కొందరు నేతలు తమ భూములు అమ్ముకోవడానికి ఈ ప్రాంతంలోనే రాజధాని ఏర్పడబోతుందని ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.