దొరగారిని ప్రశ్నించేందుకే పార్టీ పెడుతున్నా.. ఖమ్మం సభలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు..!

Saturday, April 10th, 2021, 08:10:29 AM IST

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల నిన్న జరిగిన ఖమ్మం సభ ద్వారా పార్టీనీ ప్రకటించబోతున్నారని అంతా అనుకున్నా అది జరగలేదు. అయితే జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా కొత్త పార్టీ పేరు మరియు ఆ రోజే పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తామని షర్మిల సభాముఖంగా తెలియచేశారు. ఇక తాను ముమ్మాటికి తెలంగాణ బిడ్డనేనన్న షర్మిల బరాబర్ తెలంగాణలో నిలబడతా అని స్పష్టం చేశారు. తనకు అవకాశం ఇవ్వాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం దొరల కాళ్ల కింద నలిగిపోతోందని మండిపడ్డారు.

అయితే తెలంగాంణలో రైతులుకు రుణమాఫీ అమలు కావడం లేదని, దళితులకు మూడు ఎకరాల భూమి ఏమయ్యిందని, ఇంటికో ఉద్యోగం ఎక్కడికి పోయిందని, కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీ యాడికి పోయిందని, నిరుద్యోగ భృతి ఊసే లేదని, విద్యార్థుల్కు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం సరిగ్గా అమలు కావడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని షర్మిల అన్నారు. నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ఈ నెల 15 నుంచి మూడు రోజుల హైదరాబాద్‌లో తాను నిరాహార దీక్ష చేస్తానని షర్మిల చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని తాను పెట్టబోయే పార్టీ ప్రజల పక్షాన నిలబడేందుకు అని అన్నారు. రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురాడానికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. ఆనాడు వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతిరోజు కొన్ని వందల మందిని కలిసేవారని కానీ సీఎం కేసీఆర్ కనీసం సచివాలయానికి కూడా వెళ్ళడం లేదని ఎద్దేవా చేశారు.