వైఎస్ షర్మిల ఖమ్మం బహిరంగ సభకు ముఖ్య అతిథి ఫిక్స్..!

Wednesday, April 7th, 2021, 06:09:00 PM IST

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల ఈ నెల 9న ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ పేరును, పార్టీకి సంబంధించిన కార్యకలాపాలను ప్రకటించబోతున్నారు. అయితే ఈ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతుండగా తెలంగాణతో పాటు ఏపీ నుంచి కూడా భారీగా వైఎస్ అభిమానులు, షర్మిల అభిమానులు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. అయితే వైఎస్ షర్మిల బహిరంగ సభకు ముఖ్యఅతిథి ఎవరన్న దానిపై ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త వినిపిస్తుంది.

అయితే ఈ బహిరంగ సభకు షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ హాజరుకానున్నారని సమాచారం. తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని మళ్ళీ తీసుకురావాలని భావిస్తున్న షర్మిల తన తల్లిని పక్కన పెట్టుకునే పార్టీ ప్రకటన చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తల్లి విజయమ్మ పక్కన ఉంటే రాజన్న బిడ్డగా ఆయన అభిమానుల మద్ధతు మరింత ఎక్కువగా లభిస్తుందని, ఆ సెంటిమెంట్ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంటుందని షర్మిల అనుచరులు ఆమెతో చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ముందునుంచే తన పార్టీకి తన తల్లి విజయమ్మ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఖమ్మం సభకు కనుక విజయమ్మ హాజరైతే షర్మిల ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీలో విజయమ్మ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.