త్వరలో టీడీపీలో చేరుతా.. సంచలన ప్రకటన చేసిన వైసీపీ కీలక నేత..!

Monday, March 8th, 2021, 11:40:37 PM IST

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు సంచలన ప్రకటన చేశారు. తాను త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్టు తేల్చి చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు మరింత పెరిగాయని, పంచాయతీ ఎన్నికలలో వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని, ప్రత్యర్ధి పార్టీ అభ్యర్థులను బెదిరించి ఎక్కువ స్థానాలను ఏకగ్రీవాలు చేసుకుందని ఆరోపించారు.

ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై డేవిడ్ రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, మంత్రిగా బాలినేని ఒంగోలుకు చేసింది ఏమీ లేదని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఒంగోలు ప్రజలను బాలినేని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఒంగోలు అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి ఓటు వేయాలని డేవిడ్ రాజు కోరారు.

ఇదిలా ఉంటే డేవిడ్ ‌రాజు రాజకీయ ప్రయాణం టీడీపీ నుంచే ప్రారంభమైంది. తొలుత జెడ్పీ చైర్మన్‌గా పని చేసిన ఆయన 1999లో టీడీపీ నుంచి సంతనూతలపాడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికలలో ఎర్రగొండపాలెం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ చేతిలో ఓడిపోయారు. ఇక 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన డేవిడ్ రాజు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన మళ్ళీ టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం టికెట్‌ను బూదాల అజితారావుకి కట్టబెట్టడంతో మనస్తాపానికి గురైన డేవిడ్ రాజు మళ్ళీ వైసీపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ కండువా కప్పుకునేందుకు ఆయన రెడీ అయిపోయారు.