మూవీ రివ్యూ : “బందోబస్త్”

తమిళ నాట విలక్షణ నటుడు సూర్య హీరోగా మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “బందోబస్త్”. టీజర్ మరియు ట్రైలర్లతో మంచి అంచనాలను ఏర్పర్చుకున్న ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.అటు తమిళ్ మరియు తెలుగులో కూడా ఒకేసారి మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా లేదా అన్నది ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

కథ లోకి వెళ్లినట్టయితే ఒక ఊహించని పరిస్థితుల్లో దేశ ప్రధాని మోహన్ లాల్ ఒక ఉగ్రవాదుల దాడిలో చనిపోతారు.దీనితో ఈ కేసు వెనుకున్న రహస్యాన్ని చేధించడానికి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా (కథిర్)సూర్య నియమించబడతాడు.ఈ క్రమంలో ఈ కేసు వెనుక ఇంకా చాలా ఉగ్రవాద గ్రూపులు ఉన్నాయని తెలుసుకుంటాడు.అయితే ఈ కేసుకు బొమన్ ఇరానీ మరియు ఆర్యలకు ఉన్న సంబంధం ఏమిటి?తాను చేపట్టిన ఈ కేసు వెనుక ఉన్న అసలు నిందితులు ఎవరు?వారిని సూర్య పట్టుకున్నాడా లేదా అన్నది తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ సినిమాకు మొదటగా సూర్య మరియు మోహన్ లాల్ వంటి ఇద్దరు స్టార్స్ ను తీసుకోవడమే ఒక పెద్ద ఎస్సెట్ అని చెప్పొచ్చు.అందుకు తగ్గట్టుగానే ఈ ఇద్దరి పాత్రలు కూడా సినిమా మొత్తం ట్రావెల్ అవుతాయి.ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సూర్య చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరియు అందుకు తగ్గట్టుగా కథనం కూడా ఆసక్తికరంగా కొనసాగుతుంది.అంతే కాకుండా యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ సెకండాఫ్ పై మరింత ఆసక్తి కలిగించేలా చేస్తుంది.అయితే సెకండాఫ్ కూడా ఫస్టాఫ్ లా ఒక ఫ్లో లో అలా మొదలవుతుంది కానీ అలా అలా కాస్త కథనం నెమ్మదించిన భావన ప్రేక్షకుడికి కలుగుతుంది,కానీ సినిమా పూర్తి కావడానికి సమయం దగ్గర పడుతుంది అనే టైం లో కథ చుట్టూ అల్లుకున్న రహస్యం ఏమిటి అన్నది రివీల్ అవుతుండే సన్నివేశాలు ఆసక్తికరంగా కొనసాగుతాయి.కానీ సినిమాను ఎక్కువ యాక్షన్ సీన్లతో నింపేయటం వలన అవి బాగా ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది.

ఇక నటీనటుల విషయానికి వచ్చినట్టయితే సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఒక సినిమాను మించి మరో సినిమాలో నటించినట్టే ఈ చిత్రంలో అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చారు.అలాగే మోహన్ లాల్ పాత్ర కూడా సినిమాలో కీలకమైనది ఈ పాత్రకు మోహన్ లాల్ మాత్రమే పర్ఫెక్ట్ అనేలా ఆకట్టుకున్నారు.ఇక మిగతా పాత్రల్లో కనిపించిన బాలీవుడ్ ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ, ఆర్య,సముద్రఖని మరియు సయేషాలు కూడా తమదైన నటనను కనబరుస్తారు.

ఇక దర్శకుడు మరియు ఇతర సాంకేతికవర్గం విషయానికి వచ్చినట్టయితే అతను ఎంచుకున్న స్టోరీ లైన్ బాగానే ఉంది కానీ దాన్ని సెకండాఫ్ కి వచ్చేసరికి మాత్రం డల్ చేసేసారు.ఈ విషయంలో ఇంకాస్త ఆసక్తికరంగా మలచి ఉంటే బాగుండేది.అలాగే సూర్య కెరీర్ లో ఇప్పటికే చూసిన ఎన్నో సినిమాలను అన్ని కలిపి ఈ చిత్రంలో చూసినట్టుగా అనిపిస్తుంది.అంతే కాకుండా సినిమా మొదలైన దగ్గర నుంచి కాస్త ఎంటెర్టైనమెంట్ పాళ్ళు ఏమి లేకుండా సీరియస్ గా ఎలాంటి కామెడీ లేకపోవడం అన్ని వర్గాల ప్రేక్షకులకు రుచించకపోవచ్చు.అలాగే హ్యారిస్ జైరాజ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

సూర్య స్క్రీన్ ప్రెజన్స్
మోహన్ లాల్,బొమన్ ఇరానీ మరియు ఆర్యలు నటన

మైనస్ పాయింట్స్ :

సీరియస్ గా సాగే కథనం
పాటలు
రుచించని యాక్షన్ సీక్వెన్సులు

తీర్పు :

మొత్తానికి “బందోబస్త్” చిత్రం ఒక సీరియస్ గా సాగే థ్రిల్లర్ డ్రామా అని చెప్పొచ్చు. సూర్య మరియు మోహన్ లాల్ ల ఆకట్టుకునే నటనతో ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఆకట్టుకుంటుంది.కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి సాగదీతగా అనిపించడం అక్కడక్కడా ఫ్లో మిస్సవ్వడం మితి మీరిన యాక్షన్ సీన్స్ వంటివి ఆకట్టుకోవు.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ గా నిలిచిపోవచ్చు.

Rating: 2.5/5