ఒక వికెట్ నష్టపోకుండా రాజస్థాన్‌పై ఆర్సీబీ ఘన విజయం..!

Friday, April 23rd, 2021, 12:48:55 AM IST

ముంబై వాంఖడే వేదికగా నేడు రాజస్థాన్ రాయల్స్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ అదిరిపోయే విక్టరీ సాధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 178 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శివమ్ దూబే (46), రాహుల్ తేవాటియా (40), రియాన్ పరాగ్ (25), కెప్టెన్ సంజు శాంసన్ (21) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 177 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ తలో మూడు వికెట్లు పడగొట్టారు.

అనంతరం 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీనీ ఓపెనర్లే గెలిపించేశారు. దేవ్‌దత్ పడిక్కల్(101; 52 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌‌లు) సెంచరీతో కదం తొక్కగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ(72; 47బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. దీంతో కేవలం 16.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఐపీఎల్ 2021లో ఆర్సీబీ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. ఇదిలా ఉంటే ఈ సీజన్లో తొలిసారిగా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా విజయం సాధించిన ఏకైక జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది. ఇక అన్‌క్యాప్డ్ ఆటగాళ్లలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాదించిన ఆటగాడిగా పడిక్కల్ ఘనత సాధించగా, ఐపీఎల్ చరిత్రలో 6000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.