మొతేరా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 25 పరుగులు, శుభ్‌మన్ గిల్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ విక్టరీతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో అడుగుపెట్టేందుకు టీమిండియా మరింత చేరువయ్యింది.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టును భారత బౌలర్లు తొలి రోజు 112 పరుగులకే ఆలౌట్ చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ తొలి రోజు మూడు వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. ఈ రోజు ఓవర్ నైట్ స్కోర్ 99/3 తో ఆట కొనసాగించిన భారత్ మరో 46 పరుగులకే మిగతా 7 వికెట్లు కోల్పోవడంతో 145 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే ఇండియాకు తొలి ఇన్సింగ్స్ లో 33 పరుగుల స్వల్ఫ అధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్ల దెబ్బకు మరోసారి కుప్పకూలి 81 పరుగులకే ఆలౌటైంది. దీంతో 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ వికెట్ నష్టపోకుండా చేధించింది.
అయితే సొంత గ్రౌండ్ లో ఆడుతున్న టీమిండియా బౌలర్ అక్షర్ పటేల్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 11 వికెట్లు తీసుకోగా, అశ్విన్ కూడా 7 వికెట్లతో తన సత్తా చాటాడు. అంతేకాదు టీమిండియా తరపున టెస్టుల్లో 400 వికెట్లు సాధించిన 4వ ఆటగాడిగా అశ్విన్ రికార్డులకెక్కాడు. టెస్టుల్లో టీమిండియా తరపున ఎక్కువ వికెట్లు సాధించిన వారిలో అనిల్ కుంబ్లే(619), కపిల్ దేవ్(434), హర్భజన్ సింగ్(417) వరుస మూడు స్థానాల్లో ఉన్నారు.