లెజెండ్ మనసులోని మాటలు : రాష్ట్రంలో కాంగ్రెస్ చనిపోలేదు.. మూర్చపోయింది అంతే అంటున్న వైఎస్ఆర్ సన్నిహితుడి మనసులోని మాటలు

Wednesday, June 1st, 2016, 08:26:15 AM IST


వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండి రాజ్య సభ సభ్యులుగా భాద్యతలను నిర్వహించి వైఎస్సార్ కు అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు అన్న పేరు తెచ్చుకున్న కేవీపీ రామచంద్రరావు నోరు తెరచి మాట్లాడటం చాలా తక్కువ. అటువంటి ఆయన వైఎస్ మరణం, కాంగ్రెస్ ఓటమి, టీడీపీ దూకుడు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకహోదా గళాన్ని గట్టిగా వినిపిస్తున్న ఆయన మనసులోని మాటలను ఒక్కసారి విందాం..

* రాష్ట్రంలో కాంగ్రెస్ చచ్చిపోలేదు. చచ్చిపోయిన పార్టీని బ్రతికించడం. కాంగ్రెస్ కేవలం మూర్చపోయింది అంతే అంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ కు రాజకీయ భవిష్యత్తు ఇంకా ఉందని బల్లగుద్దుతున్నారు కేవీపీ.

* రాష్ట్ర విభజనలో ఏమీ మాట్లాడని ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం బిల్లులు పెడుతూ హడావిడి చేస్తున్నారు అని వెంకయ్య తనను విమర్శించాడన్న మాటను కొట్టిపారేసిన కేవీపీ రాజ్యసభలో రాష్ట్రం కోసం తాను ఎంత కష్టపడింది అనే దానికి వెంకయ్యే సాక్ష్యం అన్నారు.

* రాష్ట్ర విభజన చెయ్యొద్దని ఏపీ కాంగ్రెస్ నాయకులంతా కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. విభజన జరిగితే ఎలాంటి నష్టాలు వస్తాయో కూడా వాళ్ళకు తెలిపాం అంటూ విభజనలో తమ అంగీకారం లేదని తెలియజేశారు.

* రాష్ట్ర విభజన అనివార్యం అనుకున్నప్పుడు ఏపీకి ఐదేళ్ళ పాటు ప్రత్యేక హోదా కావాలని ఆర్డినెన్స్ ఇచ్చాం కానీ ఎలక్షన్ కమీషన్ వల్ల అది చట్టబద్దం కాలేదు అని కాంగ్రెస్ చేసిన ప్రయత్నాన్ని గుర్తుచేశారు కేవీపీ.

* ప్రస్తుతం బీజేపీ చెబుతున్నట్టు హోదా వీలుకాదన్న విషయం ఆరోజు వాళ్లకి తెలీదా. ఆరోజే గనుక సూచనప్రాయంగా ఈ మాట చెప్పుంటే విభజన ఆగిపోయుండేది కదా అని బీజేపీని విమర్శించారు.

* వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలే కాదు ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ కూడా నిలబడుతుంది అంటూ భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేసారు కేవీపీ.

* రాష్ట్రాన్ని విభజించమని కాంగ్రెస్ అధిష్టానానికి రెండుసార్లు లేఖ రాసి విభజనకు కారణం అయింది కాబట్టే టీడీపీని విమర్శిస్తున్నాను అని తన ఉద్దేశ్యాన్ని పూసగుచ్చినట్టు చెప్పారు.

* కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ కు ప్రాణం. అయన గురించి నాకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు. ఆయన ఆత్మనైన నేను పార్టీని ఎలా వదిలిపెడతాను అంటూ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ కు, తనకు మధ్య ఉన్న అనుబందాన్ని గుర్తుచేసుకున్నారు కేవీపీ.

* నాకు తెలిసి వైఎస్ కొడుకు జగన్ మోహన్ రెడ్డికి ఎలాంటి దోషాలు లేవు. కానీ ఏ కోర్టూ కూడా తన పరిగణలోకి తీసుకోదు అని జగన్ పట్ల తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

* టీడీపీ కాంగ్రెస్, వైఎస్ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపణ చేసిన తరువాతే ప్రజలు కాంగ్రెస్ ను మెజారిటీతో గెలిపించారు అంటూ తమ పట్ల ప్రజల విశ్వాసాన్ని గుర్తుచేశారు.